దేవర-2కి స్క్రిప్ట్ రెడీ... షూటింగ్‌ ఎప్పుడో?

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ చేసిన దేవర సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాగానే ఆడింది. భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దేవర తీస్తున్నప్పుడే ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తామని కొరటాల ప్రకటించారు. కనుక దేవర-2 గురించి జూ.ఎన్టీఆర్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

అయితే వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘వార్’కు సీక్వెల్‌గా తీసిన వార్-2 నిరాశ పరచడంతో దేవర-2 ఉంటుందా లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ దేవర మొదటి భాగంలో కధ పూర్తవలేదు. కనుక దేవర-2కి సన్నాహాలు జరుగుతున్నాయి.

కొరటాల శివ ఇటీవలే దేవర-2 పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి జూ.ఎన్టీఆర్‌కి రెండో భాగం కధ వినిపించారని, దానికి అయన ఒకే చెప్పినట్లు సమాచారం. కనుక దేవర-2కి లైన్ క్లియర్ అయినట్లే. 

జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా, మలయాళ నటుడు టోవినో థామస్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. 

బాలీవుడ్‌ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్, టాలీవుడ్‌ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై గుల్షన్ కుమార్‌ సమర్పణలో భూషణ్ కుమార్‌, నవీన్ ఎర్నేని, రవిశంకర్, కళ్యాణ్ రామ్ కలిసి ‘డ్రాగన్’ పాన్‌ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా పూర్తిచేసిన తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ పౌరాణిక సినిమా ‘మురుగన్’ మొదలుపెట్టబోతున్నారు. ఇటీవల జూ.ఎన్టీఆర్‌ ముంబయి విమానాశ్రయంలోకి వెళుతున్నప్పుడు ఆయన చేతిలో తమిళ రచయిత ఆనంద బాలసుబ్రహ్మణ్యం వ్రాసిన ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్, ది లార్డ్ ఆఫ్ విస్డమ్‌’ అనే పుస్తకం కనిపించింది. కనుక డ్రాగన్ తర్వాత మురుగన్ మొదలు పెట్టవచ్చు. లేదా డ్రాగన్ తర్వాత వెంటనే దేవర-2 మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.