
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా “మన శివశంకర ప్రసాద్ గారు... పండక్కి వస్తున్నారు,” సినిమా టైటిల్, గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నారని స్పష్టం చేశారు. మరైయితే చిరంజీవి, బాలకృష్ణ సినిమా ఎప్పుడూ? అనే ప్రశ్నకు “వాళిద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్దంగానే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరివి చాలా డిఫరెంట్ మ్యానరిజమ్స్. కనుక వారికి సరిపోయే కధ లభిస్తే అప్పుడు చూద్దాం. కానీ ఎప్పటికైనా వారిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయాలనే అనుకుంటున్నాను,” అని చెప్పారు.
చిరంజీవిని డైరెక్ట్ చేయడం ఎలా ఉంది? అనే ప్రశ్నకు “నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ముగ్గురి సినిమాలు చూస్తూ పెరిగాను. చిరంజీవిని నేనే డైరెక్ట్ చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఈ సినిమాలో వెంకటేష్ కూడా చేస్తున్నారు. కనుక ఇద్దరినీ డైరెక్ట్ చేసే అదృష్టం నాకు దక్కింది. ఇక బాలయ్యతో కూడా చేయగలిగితే నా అంత అదృష్టవంతుడు మరొకరు లేరనుకుంటాను,” అని అనిల్ రావిపూడి అన్నారు.