
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సినీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత కొన్నేళ్ళుగా ప్రతీ రెండు మూడేళ్ళకోసారి ఈ వేతనాల పెంపు సమస్య ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ ఈవిదంగా జరిగేది కాదు. ఇప్పుడే ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదు.
సినీ కార్మికులకు సాఫ్ట్ ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామని కొందరు నిర్మాతలు చెపుతున్నారు. నిజమే! కానీ ఎప్పుడంటే కార్మికులు నెలకి 30-31 రోజులు పనిచేసినప్పుడే.
సినీ కార్మికులలో ఎక్కువ జీతం అందుకుంటున్న వారు కేవలం ఓ 10-20 శాతం మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారందరికీ ఏరోజుకారోజు జీతం అందకపోతే కుటుంబ పోషణ కష్టంగా మారుతుంది. ఇప్పటికే 12 రోజులుగా సమ్మె జరుగుతోంది. కనుక జీతాలు లేక వారందరూ ఎంత కటకటలాడుతున్నారో సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు.
కనుక నిర్మాతలు పట్టు విడుపులు ప్రదర్శించి సినీ కార్మికుల జీతాలు పెంచాలని నేను అభ్యర్ధిస్తున్నాను. సినీ నిర్మాతలకు వారి కష్టాలు వారికి ఉన్నాయి. కనుక వారు కూడా కొన్ని షరతులు విధించారు. వాటిలో కొన్ని చాలా సహేతుకమైనవి కొన్ని గొంతెమ్మ కోర్కెలు కూడా ఉన్నాయి.
కనుక అటు నిర్మాతలు, ఇటు సినీ కార్మికులు కూడా ఒకరి సమస్యలు మరొకరు అర్ధం చేసుకొని పట్టువిడుపులు ప్రదర్శించి ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. ఇలా ఎక్కువ రోజులు సమ్మె కొనసాగడం సినీ పరిశ్రమలో ఎవరికీ మంచిది కాదు. దీని వలన అందరూ నష్టపోతారు.
సినీ కార్మికులు కేవలం జీతాల పెంపు కోసమే ఫిలిం ఫెడరేషన్ ఉందనుకోకుండా ఏడాదికి ఒక్కసారైనా అందరూ షూటింగులు మానుకొని జనరల్ బాడీ మీటింగ్‌కి తప్పనిసరిగా హాజరవ్వాలి. తద్వారా సినీ కార్మికులందరూ సంఘటితంగా ఉన్నారనే సందేశం సినీ పరిశ్రమకి పంపినట్లవుతుంది,” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.