కల్కి-2: డిసెంబర్ నుంచి షూటింగ్‌ షురూ?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌ హాసన్‌ వంటి అగ్రనటులు నటించిన ‘కల్కి ఏడీ 2898’ సూపర్ హిట్ అయ్యింది. కనుక ప్రేక్షకులు దాని రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ రాజాసాబ్‌తో లాక్ అయిపోవడంతో రెండో భాగం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం కల్కి-2 షూటింగ్‌ ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరులోగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మొదటి భాగంలో ప్రభాస్-అమితాబ్ బచ్చన్‌లకు ఎక్కువ నిడివిగల పాత్రలు లభించగా రెండో భాగంలో ప్రభాస్, కమల్‌ హాసన్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

ఒకవేళ దీనికి మూడో భాగం ఉండకపోతే రెండో భాగంలోనే ప్రభాస్‌ని మహాభారతంలో కర్ణుడుతో ఏం సంబంధమో చూపాల్సి ఉంటుంది. అలాగే అశ్వధామగా నటించిన అమితాబ్ బచ్చన్‌కి కర్ణుడుకి ఏం సంబంధమో చూపాల్సి ఉంటుంది. అలాగే కమల్‌ హాసన్‌ పాత్రని వివరించాల్సి ఉంటుంది. కనుక మొదటి భాగం కంటే రెండో భాగం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.