
సరిగ్గా నోట్ల రద్దు ప్రవేశ పెట్టిన వారానికే వచ్చిన నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో బాగుంది అన్న టాక్ వచ్చినా కలక్షన్స్ మాత్రం దెబ్బ పడింది. అయితే ఇదే క్రమంలో ఆ తర్వాత వారం పరిస్థితి మరి దారుణంగా ఉన్న తరుణంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. మొదటి షో నుండి సినిమాకు యూనానిమస్ హిట్ టాక్ వచ్చింది. విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హెబ్భా పటేల్, నందిత శ్వేత, అవికా గోర్ లు హీరోయిన్స్ గా నటించారు.
ఇక ఈ సినిమా కలక్షన్స్ విషయానికొస్తే నోట్ల రద్దు ప్రభావం అంతగా ఏమి పడలేదు అనిపిస్తుంది. సరిగ్గా 7 రోజులకు ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించిందట. అంటే షేర్ వాల్యూ వచ్చేసి 12 కోట్ల పైమాటే.. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొత్తం 15 కోట్లు వచ్చిందట. ముఖ్యంగా నైజాం ఏరియాలోనే 5.8 కోట్లు కలెక్ట్ అయినట్టు టాక్. ఇక యూఎస్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 6 లక్షల డాలర్లు వసూళు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 1 మిలియన్ టచ్ చేస్తుందని అంటున్నారు.
ఏది ఏమైనా నిఖిల్ కెరియర్ లో 'ఈపిసి' హిట్ తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేయడమే కాకుండా మరిన్ని కొత్త కథలకు తనకు సపోర్ట్ ఇచ్చేలా చేసింది. శంకరాభరణం ఫ్లాప్ తర్వాత నిఖిల్ చేసిన ఈ సినిమా ఈ రేంజ్లో సక్సెస్ అవడంతో కుర్రాడు మంచి జోష్ లో ఉన్నాడు.