వెంకటేష్-త్రివిక్రమ్‌ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు

వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావు’ రెండు సూపర్ హిట్ సినిమాలకు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత దర్శకుడుగా మరి అనేకమంది పెద్ద హీరోలతో సూపర్ హిట్స్ ఇచ్చారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వెంకటేష్-త్రివిక్రమ్ కలిసి సినిమా మొదలుపెట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో వీరి సినిమాకి పూజా కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ముఖ్య అతిధిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలవుతుంది.   

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అంటే తప్పకుండా మంచి కామెడీ ఉంటుంది. తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. వెంకటేష్-త్రిష కాంబినేషన్‌లో ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’, ‘నమో వెంకటేశాయ’, ‘బాడీగార్డు’ మూడు సూపర్ హిట్స్ వచ్చాయి. కనుక ఆమె కూడా ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. కనుక ఈ సినిమాకి శుభారంభం అయినట్లే భావించవచ్చు.

ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల పేర్లు కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. కనుక ఈ సినిమాకు ‘వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అని అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తారు.