చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు: దిల్ రాజు

ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు సినీ పరిశ్రమలో నిర్మాతలకు, సినీ కార్మికులకు మద్య జరుగుతున్న చర్చల గురించి మీడియాకు వివరించారు. “ప్రస్తుతం ఇంకా చర్చలు సాగుతున్నాయి. మరొక రెండు మూడు సమావేశాల తర్వాత తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను. సినీ నిర్మాతలు కూడా కొన్ని షరతులు పెట్టారు.

గతంలో అంటే 2018,2022లో జరిగిన ఒప్పందాలలో పని షరతులను నేటికీ అమలుచేయడం లేదు. వాటిని అమలుచేయాలని నిర్మాతలు కోరారు. వాటితో పాటు పనికి సంబంధించి మరో రెండు షరతులు విధించారు. వాటికి సినీ కార్మిక సంఘాలు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు సిద్దంగా ఉన్నామని నిర్మాతలు చెప్పారు. 

రోజుకి రూ.2,000 అంతకంటే తక్కువ జీతం తీసుకుంటున్నవారికి ఒక్క శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు.అంత కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారికి కూడా కూడా ఒక శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. 

నిర్మాతల ఈ ఆఫర్, షరతులపై సినీ కార్మికులు చర్చించుకొని తమ నిర్ణయం తెలియజేస్తే నిర్మాతలు కూడా తగిన నిర్ణయం తీసుకుంటారు. బహుశః మరో రెండు మూడు సమావేశాలలో ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను,” అని దిల్ రాజు అన్నారు.