
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయని, కనుక అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ, ట్రాఫిక్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు.
కానీ జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’, రజనీకాంత్, నాగార్జున నటించిన ‘కూలీ’ రెండు పాన్ ఇండియా మూవీలు రేపే విడుదల కాబోతున్నాయి. వీటిపై చాలా భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా వీటి కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
కనుక ఇప్పటికే రెండు సినిమాలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. సినిమాలు విడుదల కావడమే ఆలస్యమన్నట్లు అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. వీటిని దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేస్తున్నారు.
కనుక తెలంగాణలో భారీ వర్షాలు పడుతునందున వాయిదా వేయలేరు. కనుక రేపు రెండు సినిమాలు తెలంగాణ రాష్ట్రంపై రెండు తుఫానుల్లా విరుచుకు పడబోతున్నాయి. మరి ఈ వర్షాలలో కూడా అభిమానులు సినిమాలు చూసేందుకు వస్తారా? రాకపోతే సినిమాల పరిస్థితి ఏమిటి? అనేది రేపు తెలుస్తుంది.