
వెండితెరపై అందమైన రంగురంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించే సినీ పరిశ్రమలో మహిళల సమస్యలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అనుపమ పరమేశ్వరన్ ఏమీ కొత్తగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. ఆమె ఇప్పటికే అనేక తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు చేసిన టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆ స్థాయిలో ఉన్న ఆమెకి కూడా సినీ పరిశ్రమలో అవమానాలు, అవహేళనలు భరించక తప్పడం లేదు. ఈ మాట ఆమె స్వయంగా చెప్పారు.
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆమె నటించిన ‘పరదా’ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆమె తాజా ఇంటర్వ్యూలో తమ పరిస్థితి వివరిస్తూ, “ఉదయం 7 గంటలకు షూటింగ్ మొదలవుతుందని చెపితే నేను ఆ సమయానికి లొకేషన్లో ఉంటాను. కానీ ఓ రెండు మూడు గంటల తర్వాత షూటింగ్ మొదలుపెడతారు.
అంతవరకు నేను ఖాళీగా కూర్చోవాలి. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో వారికి ముందే తెలిసి ఉన్నప్పుడు అదే సమయానికి రావాలని చెప్పొచ్చు కదా?అని నేను అడిగితే ఈ అమ్మాయికి పొగరు ఎక్కువ అంటారు. సరే! ఏదో ఒక రోజు షూటింగ్ ఆలస్యం అయ్యిందంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతీరోజూ రెండు మూడు గంటలు ఆలస్యంగానే మొదలవుతుంది. కానీ నేను 7 గంటలకల్లా లొకేషన్లో ఉండాలంటారు. ఎందుకు? అని అడగకూడదు.
సరే! కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తున్నారు కదా... ఈ రెండు మూడు గంటల సమయం వృధా చేయడం దేనికి? వేరే ఏవైనా పనులు పూర్తి చేయొచ్చు కదా?అని నేను చెపితే మా డబ్బుతో మేము సినిమా తీస్తుంటే మద్యలో నీకెందుకు బాధ?అని ప్రశ్నిస్తారు.
సినీ పరిశ్రమలో పనిచేసే అమ్మాయిలకైతే ఎవరైనా మొహం మీదనే ఇలా చెప్పెస్తుమ్తారు. కానీ మగవాళ్ళకైతే చెప్పలేరు. కనుక వాళ్ళ వెనుక చెప్పుకుంటారు.
నేటికీ సినీ పరిశ్రమలో అమ్మాయిలకి సముచిత గౌరవం లభించకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంటుంది. కానీ నేను ఇక్కడే బ్రతకాలి కనుక ఇటువంటి అవమానాలను, అవహేళనలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు సాగుతున్నాను. సినీ పరిశ్రమలో పనిచేసే ఆడవాళ్ళ అందరి పరిస్థితి ఇంచుమించు ఇదే,” అని అనుపమ పరమేశ్వరన్ ఆవేదన వ్యక్తం చేశారు.