
ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతలకు, సినీ కార్మికులు మద్య 30 శాతం జీతాల పెంపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరువర్గాలు ఎన్నిసార్లు చర్చలకు కూర్చున్నా ఫలించడం లేదు. కనుక సమ్మె కొనసాగుతోంది. షూటింగ్లు నిలిచిపోయాయి.
ఈ పరిస్థితిలో సినీ నిర్మాతలు, కార్మిక సంఘాల నేతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ గోడు మొర పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయన సినీ వర్కర్లకు సంఘీభావం తెలిపారని, నిర్మాతలతో మాట్లాడి వారికి 30 శాతం జీతాలు పెంచేందుకు ఒప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది చిరంజీవి ద్రుష్టికి కూడా రావడంతో అయన వెంటనే అప్రమతమయ్యి ఖండించారు. చిరంజీవి ఏమన్నారంటే, “ఫిలిమ్ ఫెడరేషన్ (సినీ కార్మిక సంఘాలు)కి చెందిన కొందరు వ్యక్తులు నన్ను కలిశారని, నిర్మాతలతో మాట్లాడి వారికి 30 శాతం జీతాలు పెంచేందుకు ఒప్పిస్తానని వారికి నేను హామీ ఇచ్చానని వారు చెప్పుకుంటున్నట్లు నాకు తెలిసింది. కానీ నేను ఎవరినీ కలవలేదు. ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఈ పుకార్లని నేను ఖండిస్తున్నాను.
అయినా ఈ సమస్యని ఏ ఒక్కరో పరిష్కరించలేరు. సినీ పరిశ్రమలో అందరి తరపున ఫిలిమ్ ఛాంబర్ సినీ కార్మికులతో చర్చలు జరుపుతోంది. ఆ చర్చల ద్వారానే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. కనుక ఇటువంటి పుకార్లను నమ్మవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.