యూసఫ్‌ గూడాలో వార్-2 ప్రీ రిలీజ్: 1200 మంది పోలీసులు!

నేడు మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌, యూసఫ్‌ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అట్టహాసంగా జరుగబోతోంది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉన్నందున ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జూ.ఎన్టీఆర్‌ అభిమానులు హాజరవుతారని పోలీసులు ముందే ఊహించి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ఏకంగా సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో సహా మొత్తం 1200 మంది పోలీసులను మొహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిఘా పెడుతున్నారు. 

ఇటీవల విడుదల చేసిన వార్-2 ట్రైలర్లో జూ.ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈ సినిమాకి కధ: ఆదిత్య చోప్రా, దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ , స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, సంగీతం: ప్రీతం, కెమెరా: బెంజామిన్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్, స్టంట్స్: స్పైరో రాజాతోస్, ఫ్రాంజ్ స్పిల్ హౌస్, అనల్ అరసు చేశారు.  

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ బాలీవుడ్‌ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.