టాలీవుడ్‌లో కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టాలీవుడ్‌లో నిర్మాతలకు, సినీ కార్మికులకు మద్య శనివారం ఫిలిమ్‌ ఛాంబర్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనుక నేడు ౭వ రోజు సమ్మె కొనసాగుతోంది. ఫిలిమ్‌ ఫెడరేషన్‌లోని 24 శాఖల కార్మికులు నిర్మాతల తీరుకి నిరసనగా ఆదివారం ఉదయం అన్నపూర్ణ 7 ఏకర్స్ వద్ద గల యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. 

శనివారం జరిగిన చర్చల గురించి ఫిలిమ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఏమన్నారంటే... సినీ కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాల పెంపుకి నిర్మాతలు అంగీకరించారు. 

కార్మికులలో రోజుకి రూ. 2,000 జీతం పొందుతున్నవారికి ఈ ఏడాది 15 శాతం, ఆ తర్వాత ఏడాదికి 5 శాతం చొప్పున పెంచేందుకు ఒప్పుకున్నారు. 

కార్మికులలో రోజుకి రూ.1,000 అంతకంటే తక్కువ జీతం పొండుతున్నవారికి మాత్రం ఈ ఏడాదే 2, శాతం పెంచి ఆ తర్వాత ఏడాదికి 5 శాతం చొప్పున పెంచుతామని చెప్పారు. 

కార్మికులలో రోజుకి రూ.4,000 అంతకంటే ఎక్కువ జీతం పొందుతున్నవారికి మాత్రం జీతాలు పెంచలేమని చెప్పారు. 

చిన్న బడ్జెట్‌ సినిమాలకు ఇప్పుడున్న వేతనాలే చెల్లిస్తాము. చిన్న బడ్జెట్‌ సినిమా అంటే ఎంత బడ్జెట్‌? వగైరా త్వరలోనే ప్రకటిస్తాము,” అని చెప్పారు. 

ఈ షరతులకు సినీ కార్మికులు కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ రోజువారీ జీతాల ఆధారంగా సినీ కార్మికులని విభజించి కొందరికి ఒకలా, మరికొందరికి మరొకలా చెల్లిస్తామనడాన్ని తప్పు పట్టారు. 

ముఖ్యంగా రోజుకి రూ.4,000 అంతకంటే ఎక్కువ జీతం పొందుతున్నవారికి జీతాలు పెంచబోమని నిర్మాతలు చెప్పడాన్ని సినీ కార్మికులు తప్పు పట్టారు. ఈవిదంగా సినీ కార్మికులను, యూనియన్లను చీల్చి, తమ మద్య విభేదాలు సృష్టించాలని నిర్మాతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

అందరికీ 30 శాతం జీతాలు ఒకేలా పెంచాలని సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అన్నారు. మా డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోలేదు కనుక, ఒప్పుకునే వరకు షూటింగులకు హాజరుకాబోమని చెప్పారు.