షూటింగ్‌లు నిలిపేయాల్సిందే: ఫిలిమ్‌ ఛాంబర్

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల మండలి (ఫిలిమ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్)కి సినీ కార్మికుల సంఘాలు(ఫిలిమ్‌ ఫెడరేషన్) మద్య చర్చలు విఫలమయ్యాయి. ఫిలిమ్‌ ఫెడరేషన్ కోరుతున్నట్లుగా 30 శాతం జీతాలు పెంచే ప్రసక్తే లేదని నిర్మాతల మండలి మరోసారి స్పష్టం చేసింది. 

కనుక తక్షణమే నిర్మాతలందరూ సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నోటీస్ జారీ చేసింది. నిర్మాతలు ఎవరూ కూడా ఫిలిమ్‌ ఫెడరేషన్ ప్రతినిధులతో ఎటువంటి చర్చలు జరుపవద్దని సూచించింది.

అలాగే వివిధ సినీ స్టూడియోలలో సినిమా షూటింగ్‌లను అనుమతించవద్దని, అవుట్ డోర్ షూటింగ్‌లకు పనిచేసే సంస్థలు కూడా షూటింగ్‌లలో పాల్గొనవద్దని నిర్మాతల మండలి సూచించింది. ఈ ఆదేశాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకోవలసి వస్తుందని నిర్మాతల మండలి హెచ్చరించింది. 

ఈ సమస్యపై శాశ్విత పరిష్కారం సాధించేందుకు తాము కృషి చేస్తున్నామని కనుక అంతవరకు అందరూ షూటింగ్‌లు నిలిపివేసి ఓపిక పట్టాలని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. 

ఈ సమస్యపై చర్చలు జరిపేందుకు వీర శంకర్ అధ్యక్షతన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సినీ కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం సుదీర్గంగా చర్చలు జరిపింది. కానీ జీతాల పెంపు విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో ఈ కటిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని నిర్మాతల మండలి తెలియజేసింది.