టాలీవుడ్‌లో మళ్ళీ సమ్మె... నిలిచిన షూటింగ్స్

తెలుగు సినిమా పరిశ్రమలో మళ్ళీ కొత్త సమస్య మొదలైంది. నిన్న (సోమవారం) నిర్మాతల మండలికి, కార్మిక సంఘాల నేతలకు మద్య లేబర్ కమీషనర్ సమక్షంలో చర్చలు జరిగాయి. కానీ కార్మికులు కోరినట్లు 30 శాతం జీతాలు పెంచలేమని నిర్మాతలు వాదిస్తుండటంతో కార్మిక సంఘం ప్రతినిధులు సమావేశం మద్యలోనే బయటకు వెళ్ళిపోయారు. నేటి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో కొన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. 

కోట్లాది రూపాయలు పెట్టుబడి తాము సినిమాలు తీస్తుంటే, కార్మిక సంఘాలు అకస్మాత్తుగా సమ్మె చేసి షూటింగులకు ఆటంకం కలిగించడం అనైతికమని నిర్మాతల మండలి ఆరోపించింది. ఇప్పటికే తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ పరిస్థితిలో జీతాలు పెంచాలంటే కుదరదని నిర్మాతల మండలి తేల్చి చెప్పింది. సినీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో నిర్మాతల మండలి కూడా వెనక్కు తగ్గకూడదని నిర్ణయించింది. 

సినీ కార్మిక సంఘాలతో, వాటి సభ్యులతో సంబందం లేకుండా అర్హత, ఆసక్తి కలిగినవారిని నియమించుకొని యధాప్రకారం షూటింగులు జరిపించుకోవచ్చని తెలియజేస్తూ నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది. 

ఈ మేరకు వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో సినీ కార్మికుల కోసం ఓ ప్రకట విడుదల చేసింది. సినీ కార్మిక సంఘంలో సభ్యత్వం ఉన్నవారు, లేనివారు ఎవరైనా వచ్చి పని చేయవచ్చని తెలియజేసింది. అవసరమైతే వారికి ఆయా రంగాలలో శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించింది. 

మరోపక్క సినీ కార్మిక సంఘాలు కూడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెపుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో నానాటికీ ఇంటి అద్దెలు, రవాణా ఛార్జీలు పెరిగిపోతుండటంతో ప్రస్తుతం తమకు ఇస్తున్న జీతాలతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందని అందుకే తాము జీతాలు పెంచాలని కోరుతున్నామని చెప్పారు. 

తాము కూడా సినీ పరిశ్రమ మీదే ఆధారపడి జీవిస్తున్నామని కనుక సినీ నిర్మాతలు, పరిశ్రమ కలకాలం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నామని సినీ కార్మిక సంఘం నేతలు చెప్పారు. కానీ సినీ నిర్మాతలు తమ సమస్యలను అర్ధం చేసుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కనుక టాలీవుడ్‌లో నేటి నుంచి మొదలైన ఈ సమ్మె ఎప్పటికీ ముగుస్తుందో.. ఏవిదంగా ముగుస్తుందో? ఎవరూ చెప్పలేకపోతున్నారు.