తెలుగు సినిమాలకు ఏడు జాతీయ అవార్డులు

తెలుగు సినిమాలంటే నాలుగు డాన్సులు, నాలుగు ఫైట్స్, నరుకుడే అన్నట్లు మాస్ మసాలా సినిమాలు తీస్తూనే ఉన్నారు. కనుక జాతీయ అవార్డులు లభించడం లేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. 

కానీ ఆ మాస్ మసాలా సినిమాల మద్యనే కొన్ని చక్కటి సినిమాలు కూడా వస్తున్నాయి. అవే నేడు తెలుగు సినిమా పరువు కాపాడాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో ఏడు అవార్డులు తెలుగు సినిమాలకు లభించాయి. 

వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సినిమాకు ఉత్తమ సాహిత్యం విభాగంలో ‘ఊరు పల్లెటూరు’ పాట రచయిత కాసర్ల శ్యామ్‌ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ రెండు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కోరియోగ్రఫీ, ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘హనుమాన్’కు ఈ అవార్డులు లభించాయి. 

సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’కి కూడా రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ స్క్రీన్‌ ప్లే విభాగంలో దర్శకుడు సాయి రాజేష్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఇదే సినిమాలో ‘ప్రేమిస్తున్నా’ అనే పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్‌కు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ అవార్డుకి ఎంపికయ్యారు. 

తొలిసారిగా సినిమాలో నటించిన సుకృతి వేణి (ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె)కి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో  వచ్చిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో సుకృతి వేణికి ఈ అవార్డు లభించింది. 

జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమాలు ఇవే...       

1. ఉత్తమ చిత్రం: భగవంత కేసరి (నందమూరి బాలకృష్ణ)

2. ఉత్తమ యాక్షన్ కోరియోగ్రఫీ: హనుమాన్ 

3. ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్ 

4. ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబీ (సాయి రాజేష్)

5. ఉత్తమ గాయకుడు: బేబీ (పీవీఎన్ఎస్ రోహిత్‌)

6. ఉత్తమ సాహిత్యం: బలగం (కాసర్ల శ్యామ్‌)    

7. ఉత్తమ బాలనటి: గాంధీ తాత చెట్టు (సుకృతి వేణి).