చిరంజీవి నోట విశ్వంభర ముచ్చట్లు

మళ్ళీ చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మల్లాది వశిష్ట దర్శకత్వంలో చేసిన ‘విశ్వంభర’ షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పారు.

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పేశారు. ప్రధాన హీరోయిన్‌గా త్రిష, రెండో హీరోయిన్‌గా ఆషికా రంగనాద్ చేశారని, మిగిలినవారందరూ విశ్వంభరలో ఇతర పాత్రలు చేశారని చెప్పారు.

వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతున్నందునే సినిమా విడుదల ఆలస్యమవుతోంది తప్ప వేరే కారణం లేదని స్పష్టం చేశారు. ఆ పనులు పూర్తి కాగానే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు. 

ఈ సినిమా టీజర్‌లో కనిపించిన గ్రాఫిక్స్, పాప చెవులు ‘అవతార్’ సినిమా నుంచి కాపీ కొట్టారనే విమర్శలపై చిరంజీవి స్పందిస్తూ, “నా చిన్నప్పుడు చందమామ కధల పుస్తకంలోనే ‘జ్వాలా ద్వీపం’ అనే సీరియల్ వచ్చేది. దానిలో ఉన్నవే ‘అవతార్’ వంటి సినిమాలలో కనిపిస్తే ఎవరూ కాపీ కొట్టామని విమర్శించలేదు.

కానీ అవతార్ సినిమాని మేము కాపీ కొట్టామని ఆరోపిస్తున్నారు. అంతకంటే చందమామ పుస్తకంలో కధలను, చిత్రాలను ‘విశ్వంభర’ కాపీ కొట్టిందని ఉంటె నేను చాలా సంతోషించేవాడిని,” అని అన్నారు.                

విశ్వంభరలో కునాల్ కపూర్, సురభి పురాణిక్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనాకాలం సౌరవ్ లోకేష్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ స్పెషల్ సాంగ్ (డాన్స్) చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభరని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కించారు.