
మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేసిన ‘విశ్వంభర’ షూటింగ్ చివరిలో చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ వివాదస్పదం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
విశ్వంభరలో 5 పాటలను కీరవాణి చేత చేయించి, ఆరోపాట (స్పెషల్ సాంగ్)ని భీమ్స్ సిసిరోలియో చేత చేయించడాన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. ఇలా చేయడం ఆస్కార్ అవార్డ్ గ్రహీత అయిన కీరవాణిని అవమానించడమేనని విమర్శలు వినిపించాయి.
వీటిపై దర్శకుడు మల్లాది వశిష్ట స్పందిస్తూ, “ఈ స్పెషల్ సాంగ్ చేయాల్సిన సమయానికి కీరవాణి హరిహర వీరమల్లు నేపధ్య సంగీతం పని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఆయన సూచన మేరకే మేము ఈ పాటని భీమ్స్ సిసిరోలియోకి అప్పగించాము.
తన వలన సినిమా ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతోనే కీరవాణి ఈవిదంగా చేయమని మాకు చెప్పారు. ఓ సినిమాకు ముగ్గురు నలుగురు పాటలు వ్రాస్తున్నప్పుడు, విశ్వంభరలో ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తే తప్పేమిటి? అని కీరవాణి ప్రశ్నించారు. కనుక ఆయన సూచన మేరకే భీమ్స్ సిసిరోలియో ఈ పాట పూర్తి చేశారు,” అని మల్లాది వశిష్ట చెప్పారు.
విశ్వంభరలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి పురాణిక్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనాకాలం సౌరవ్ లోకేష్ నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌కు మొదట తమన్నాని అనుకున్నప్పటికీ మోనీరాయ్ చేత చేయించారు. ఆ పాట చిత్రీకరణతో విశ్వంభర షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభరని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
విశ్వంభర సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు కానీ అప్పుడే పవన్ కళ్యాణ్, బాలకృష్ణళ సినిమాలు ఓజీ, అఖండ-2 విడుదలవుతుండటంతో వాయిదా వేసుకున్నట్లు దర్శకుడు మల్లాది వశిష్ట చెప్పారు. సీజీ వర్క్స్ కూడా పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మల్లాది వశిష్ట చెప్పారు.