తెలంగాణలో వీరమల్లు టికెట్ ధరలు పెంపు

పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, తదనంతర పరిణామాలు అందరికీ తెలుసు. నేను ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండగా ఇకపై ఏ సినిమా బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ వేసుకునేందుకు, టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించబోనని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. 

కానీ ఈ నెల 24న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాని ఒకరోజు ముందుగా స్పెషల్ షో ప్రదర్శనకు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయం నిర్మాత ఏఎం రత్నం ఇటీవల జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్వయంగా చెప్పారు. ఈ విషయంలో తమకు సిఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి తోడ్పడ్డారని సభాముఖంగా చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాని ప్రకారం రేపు (బుధవారం) రాత్రి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో వేసుకోవచ్చు. దాని టికెట్ ఛార్జీ రూ. 600 జీఎస్టీ ఛార్జీలు అదనం. 

అలాగే ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు మొదటి మూడు రోజులూ రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.200,  మల్టీ ప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.150 చొప్పున టికెట్ ధరపై అదనంగా వసూలు చేసుకోవచ్చు. వీటికి జీఎస్టీ ఛార్జీలు అదనం.    

ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 2 వరకు రోజుకి 5 షోలు వేసుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100,  మల్టీ ప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.150 చొప్పున టికెట్ ధరపై అదనంగా వసూలు చేసుకోవచ్చు. వీటికి జీఎస్టీ ఛార్జీలు అదనం. 

తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంపై బీఆర్ఎస్‌ పార్టీ, హైకోర్టు ఏవిదంగా స్పందిస్తాయో?