పెద్ది కోసం రామ్ చరణ్‌ చేంజ్ ఓవర్!

రంగస్థలం సినిమాలో చెవిటి వాడిగా అద్భుతంగా నటించిన రామ్ చరణ్‌  ‘పెద్ది’ సినిమాలో క్రికెటర్‌గా కనిపించేందుకు   తన బాడీ షేప్ పూర్తిగా మార్చుకొంటున్నారు. దీని కోసం జిమ్‌లో ఎంతగానో శ్రమిస్తున్నారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రామ్ చరణ్‌ ఫోటోని  చూసి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. 

సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ ఓ గ్రామస్థాయి క్రికెటర్‌ పెద్దిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. దానిలో అనేక భావోద్వేగాలు, పోరాటాలు, డబ్బు, రాజకీయాలు, తొక్కేయడాలు వంటివి చాలా ఉంటాయని జెర్సీ వంటి సినిమాలు నిరూపించి చూపి విజయం సాధించాయి. దర్శకుడు బుచ్చిబాబుకి రామ్ చరణ్‌ వంటి ఒక అద్భుతమైన నటుడు, ఒక మంచి కధ చేతిలో ఉన్నాయి. పైగా దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పెద్దిని చూపగలిగితే ఇద్దరి పేరు దేశమంతా మారుమ్రోగిపోతుంది. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఏ.ఆర్. రెహమాన్, కెమెరా: ఆర్.రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.