రాహుల్ సిప్లీగంజ్‌కి కోటి రూపాయలు నజరానా

ప్రముఖ యువ గాయకుడు రాహుల్ సిప్లీగంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు నగదు బహుమతి ప్రకటించింది. హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి నాటునాటు పాటతో ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ సిప్లీగంజ్‌కి తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించలేదని ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి అన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పి అప్పుడే రూ.10 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు. ఇటీవల గద్దర్ అవార్డుల కార్యక్రమంలో కూడా రాహుల్ సిప్లీగంజ్‌ ప్రతిభని గుర్తించి ప్రత్యేకమైన అవార్డు ఏదైనా ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు. నేడు పాతబస్తీ లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ సిప్లీగంజ్‌కి కోటి రూపాయలు నగదు పురస్కారం ప్రకటించింది. 

తన ప్రతిభ గుర్తించి ఇంతగా గౌరవించి నగదు పురస్కారం అందజేస్తున్నందుకు రాహుల్ సిప్లీగంజ్‌ సిఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.