
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో రెండో హీరోయిన్‌గా రాశీ ఖన్నా ఎంపికైంది. ఇటీవలే ఆమె కూడా షూటింగులో పాల్గొంటున్నారు.
హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయినందున వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై కూడా చాలా బారీ అంచనాలున్నాయి. కానీ సినిమా మొదలుపెట్టి మూడేళ్ళవుతున్నా ఇంత వరకు షూటింగ్ పూర్తవకపోవడం వలన మొదట ఏర్పడిన హైప్ క్రమంగా తగ్గింది.
కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా ఒప్పుకున్నా మూడు సినిమాలు పూర్తిచేస్తుండటంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.