అందరికీ మెగా వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పూర్తిచేయగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా157 వర్కింగ్ టైటిల్‌తో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుండగా, లొకేషన్లో ఉన్నవారు ఎవరో తమ మొబైల్ ఫోన్‌లో ఓ సన్నివేశాన్ని రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతోంది. 

మీడియా లీకులపై సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియాలో అందరికీ ఓ విజ్ఞప్తితో పాటు హెచ్చరిక జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ఎవరూ షేర్ చేయవద్దని, రికార్డ్ చేయద్దని దానిలో కోరారు. ఒకవేళ ఎవరైనా వాటిని ఇంకా షేర్ చేస్తున్నట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేక్షకులను మెప్పించాలని యూనిట్ సభ్యులు అందరూ ఎంతో శ్రమించి ఈ సినిమా తీస్తుంటే దానిని దొంగచాటుగా షూట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, షేర్ చేయడం సరికాదని కనుక మెగా157 సినిమాకి సంబంధించి ఫోటోలు, ఆడియో, వీడియో చూడవద్దని, ఎవరితో షేర్ చేయవద్దని షైన్ స్క్రీన్స్ సంస్థ విజ్ఞప్తి చేసింది.  

ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్‌’గా నటిస్తుండగా నయనతార ఆయనకు జంటగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి మరోసారి కన్ఫర్మ్ చేశారు.