
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) శుక్రవారం రాత్రి కన్ను మూశారు. రెండు మూత్ర పిండాలు చెడిపోవడంతో గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప బ్రతకరని వైద్యులు చెప్పడంతో ఆయన భార్య, కుమార్తె సోషల్ మీడియా ద్వారా ఆర్ధిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేయగా కొందరు సాయం చేశారు. కానీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సరిపడ సాయం అందకపోవడంతో ఆయన పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. మచిలీపట్నంలో చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు కనుక అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. ఓ మిత్రుడు ద్వారా 1989లో దివంగత సినీ నిర్మాత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిచయం ఏర్పడింది.
ఆయన 1991లో తీసిన ‘జంతర్ మంతర్’ సినిమాలో ఫిష్ వెంకట్‌కు అవకాశం కల్పించడంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూనే ఉన్నారు.
వీవీ నాయక్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా 2002లో విడుదలైన ‘ఆది’ సినిమాతో ఫిష్ వెంకట్‌కు మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుంచి 100కు పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
ఫిష్ వెంకట్ చేసిన సినిమాలలో దిల్, బన్నీ, అత్తారింటికి దారేదీ, లక్ష్మీ, చెన్నకేశవ రెడ్డి, గబ్బర్ సింగ్, డిజే టిల్లు, కింగ్, డాన్ శీను, మిరపకాయ్, దరువు వంటివి ఆయనకు మరింత మంచి పేరు తెచ్చాయి. ఫిష్ వెంకట్ మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో అయన అంత్యక్రియలు జరుగుతాయి.