విశ్వంభరలో సత్యలోకం!

మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేస్తున్న  సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ నుంచి చాలా రోజులుగా ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. ఈ విషయం మల్లాది విశిష్ట చెవిలో పడటంతో విశ్వంభర స్టోరీలైన్ చెప్పారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ విశ్వంలో స్వర్గలోకం, యమలోకం, భూలోకం, పాతాళలోకం వంటివి మొత్తం 14 లోకాలున్నాయని మన పురాణాలు చెపుతాయి. వాటిలో ఏడు లోకాలు పైన, ఏడు లోకాలు కింద ఉంటాయి. వాటన్నిటికీ మూలం బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం. విశ్వంభర కధ అక్కడే జరుగుతుంది.

మా హీరో శివ శంకర వరప్రసాద్ ఆ సత్యలోకానికి ఏవిదంగా చేరుకుంటాడు? అక్కడి నుంచి హీరోయిన్‌ని ఏవిదంగా తిరిగి భూలోకానికి తెచ్చుకుంటాడనేది విశ్వంభర కధ,” అని మల్లాది వశిష్ట చెప్పారు.    

విశ్వంభరలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి పురాణిక్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనాకాలం సౌరవ్ లోకేష్ నటిస్తున్నారు. తమన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ (డాన్స్)చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభరని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు.