
భారతీయ సినీ పరిశ్రమలో రామాయణ, మహాభారత గాధలను ఇప్పటివరకు ఎంతమంది ఎన్నిసార్లు సినిమాలుగా, టీవీ సీరియల్స్‌గా తీశారో లెక్కేలేదు. అయినా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నారు. తీసిన ప్రతీసారి ప్రజలు చూసి ఆస్వాదిస్తూనే ఉన్నారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరోసారి ‘రామాయణ’ పేరుతో రెండు భాగాలుగా సినిమా సిద్దం అవుతోంది. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తామని ముందే ప్రకటించి షూటింగ్ మొదలుపెట్టారు.
ఈ సినిమా బడ్జెట్ మొదట వెయ్యి కోట్లు అని టాక్ వచ్చింది కానీ అది ఒక భాగానికే అనే మరో టాక్ వినపడింది. కానీ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.4,000 కోట్లు తమ బడ్జెట్ అని దర్శకుడు నితీశ్ తివారీ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రామాయణ’ కేవలం భారతీయ ప్రేక్షకుల కోసమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాము. కనుక అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న ఈ సినిమాకి రూ.4,000 కోట్లు ఎక్కువేమీ కాదు. హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే ఇది చాలా తక్కువే. ఏడు సంవత్సరాలుగా మేము ఈ సినిమా పనిమీదే ఉన్నాము. మద్యలో కరోనా, లాక్ డవున్ కారణంగా మా సినిమా చాలా ఆలస్యమైంది. కానీ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంతవరకు తీసిన ఏ భారతీయ సినిమాకి మా ఈ ‘రామాయణ’ స్థాయి ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని నితీశ్ తివారీ అన్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్ శ్రీరాముడుగా, సన్నీ డియోల్, హనుమంతుడిగా, సాయిపల్లవి సీతమ్మవారిగా, కన్నడ నటుడు యష్ రావణుడుగా, లారా దత్తా కైకేయిగా, రకుల ప్రీత్ సింగ్ శూర్పణకగా నటిస్తున్నారు.