అలనాటి అందాల నటి బి సరోజాదేవి ఇక లేరు!

అలనాటి అందాల నటి బి సరోజాదేవి (87) సోమవారం ఉదయం బెంగళూరులో తన నివాసంలో కన్ను మూశారు. ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో 25కి పైగా సినిమాలలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. 

1938లో బెంగళూరులో జన్మించిన బి.సరోజాదేవి తండ్రి భైరప్ప ఓ సామాన్య పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు నాటకాలు వేస్తుండేవారు. కనుక తన నలుగురు కుమార్తెలలో సరోజా దేవిని నటిగా చూడాలనుకున్నారు. కానీ ఆమెకు ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదు.

కానీ తండ్రి ప్రోత్సాహంతో ఆమె కూడా నాటకాలలో నటించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో అమ్మాయిలు పాఠశాలకు వెళ్ళడమే గొప్ప విషయం. ఇక స్టేజి మీద నటించడం అంటే ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవలసి వచ్చేది. కానీ తండ్రి భైరప్ప ఆమెకు అండగా నిలబడి ధైర్యం చెప్పి ప్రోత్సాహిస్తుండేవారు. 

ఆమె నటన చూసి కన్నడ దర్శక నిర్మాత హోన్నప్ప భాగవాతార ఆమెకు మహాకవి కాళిదాస (1955)లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకు జాతీయ అవార్డు లభించడంతో సరోజాదేవి పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఆమె అనేక కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ సినిమాలలో నటించి మెప్పించారు. 

ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో 1957లో విడుదలైన పాండు రంగ మహత్యం సినిమాలో ఆమె తొలిసారిగా నటించారు. ఆ తర్వాత శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీరశూర కర్ణ, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న.. ఇలా ఆమె చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్టే.

తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, న్నాడలో రాజ్ కుమార్‌లతో ఆమె చేసిన ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. 

ఓ నటి మూడు భాషలలో వేర్వేరు హీరోలతో హిట్ పెయిర్‌గా నిలవడం మామూలు విషయం కాదు. కానీ సరోజాదేవికి ఆ క్రెడిట్ దక్కింది.         

సరోజా దేవి వివాహం 1967 లో శ్రీహర్ష అనే ఇంజనీర్‌తో జరిగింది. ఆయన కూడా ప్రోత్సహించడంతో పెళ్ళయిన తర్వాత కూడా అనేక సినిమాలలో నటించారు. 1986 లో ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. భర్త పోయిన కొన్ని రోజులకే కుమార్తె భువనేశ్వరి అనారోగ్యంతో మృతి చెందడంతో సరోజాదేవి చాలా కాలం కోలుకోలేకపోయారు.  

 ఆ తర్వాత కొంత కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ దర్శక నిర్మాతల అభ్యర్ధన మేరకు అనేక సినిమాలు చేశారు. ఆమె సుదీర్గ ప్రస్థానంలో అన్ని భాషలలొ కలిపి 200కి పైగా సినిమాలలో నటించారు.                      

ఆమె జాతీయ సినిమా అవార్డు జ్యూరీ అధ్యక్షురాలుగా చేశారు. కర్ణాటక ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అధ్యక్షురాలుగా, కన్నడ చలన చిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 

ఆమె ప్రతిభకు, సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, జీవిత సాఫల్య అవార్డులతో గౌరవించింది. తెలుగు, తమిళ్, కన్నడ రాష్ట్రాలలో ఆమెకు జరిగిన సన్మానాలకు, అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. 

సరోజాదేవి మృతి పట్ల తెలుగు, తమిళ్, కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఆమె స్వగ్రామం దశవార గ్రామంలో అంత్యక్రియలు జరుగబోతున్నాయి.