
ప్రముఖ తెలుగు సినీ నటుడు కోటా శ్రీనివాస రావు (83) ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.
కోటా శ్రీనివాసరావు 1942, జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. సినిమాలలోకి రాక ముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. నాటక రంగంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ పరిశ్రమలో ప్రవేశించి 750కి పైగా సినిమాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించారు.
ఈ సుదీర్గ సినీ ప్రస్థానంలో యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, ప్రతిఘటన, యమలీల, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం వంటి ఎన్నో హిట్ సినిమాలలో విలక్షణమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
కోటా శ్రీనివాస రావు చేసిన ఆ సినిమాలు వాటిలో పాత్రలన్నీ ఒక ఎత్తైయితే జంద్యాల దర్శకత్వంలో చేసిన ‘ఆహా నా పెళ్ళంట’ సినిమా ఒక్కటీ ఒక ఎత్తు. ఆ సినిమా తర్వాత కోటా శ్రీనివాసరావు పేరు మారుమ్రోగిపోయింది.
కోటా శ్రీనివాసరావు అపూర్వమైన ప్రతిభకు గుర్తింపుగా 8 నంది అవార్డులు, సైమా అవార్డు, 2015 లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
కోటా శ్రీనివాసరావు బీజేపీ ద్వారా రాజకీయాలలో కూడా ప్రవేశించారు. విజయవాడ తూర్పు నియోజక వర్గం బీజేపీ శాసనసభ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1999-2004వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
కోటా శ్రీనివాసరావు సతీమణి పేరు రుక్మిణీ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలుగగా 2010 లో జరిగిన రోడ్ ప్రమాదంలో కుమారుడు కోట ప్రసాద్ మరణించారు.
కోటా శ్రీనివాసరావు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.