
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త (92) హైదరాబాద్, మణికొండలో తన తన నివాసంలో సోమవారం రాత్రి కన్ను మూశారు.
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయన తమ్ముడు. ప్రముఖ దర్శకుడు రాజమౌళికి, ప్రముఖ గాయని సంగీత దర్శకుకురాలు శ్రీలేఖకి ఆయన పెదన్నాన్న.
శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. రాజమహేంద్రవరం గోదావరి అవతలి ఒడ్డున గల కొవ్వూరులో జన్మించారు. బాల్యం నుంచే సంగీతం, కళలు ఆసక్తి ఉండటంతో పెద్దయిన తర్వాత ముంబయి వెళ్ళి ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళ నేర్చుకున్నారు. కొంతకాలం కమలేశ్ అనే కుంచె పేరుతో అనేక చిత్రాలు గీశారు.
ఆ తర్వాత సంగీతంపై ఆసక్తితో గిటార్, సితార్, హార్మోనియం వంటి పలు సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ కలిసి మద్రాస్ వెళ్ళి ఇద్దరూ మెల్లగా సినీ రంగంలో ప్రవేశించారు. 1988లో విడుదలైన జానకి రాముడుతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మరి తిరిగి చూసుకోనవసరం ఏర్పడలేదు.
శివశక్తి దత్తా పలు సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు కూడా వ్రాశారు. కధానాయకుడు, ఛత్రపతి, సై, బాహుబలి 1,2, రాజన్న, ఆర్ఆర్ఆర్ , హనుమాన్ సినిమాలకు ఆయన వ్రాసిన పాటలతో మరింత గుర్తింపు పొందారు.
కళామ తల్లి సేవలో శివశక్తి దత్త తన జీవితాన్ని సార్ధకం చేసుకొని వెళ్ళిపోయారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.