వెబ్ సిరీస్‌లు కూడా కాపీలు.. కేసులా?

సినిమాలు కాపీ కొట్టుకోవడం వాటిపై కాపీరైట్ కేసులు వేసుకోవడం చూశాము కానీ తొలిసారిగా వెబ్ సిరీస్‌ కాపీ రైట్ గొడవ మొదలైంది.. రెండు ప్రముఖ ఓటీటీల మధ్య. అవే జీ5-ఈటీవీ విన్ ఓటీటీలు. 

జీ5 ఓటీటీలో ప్రసారమైన ‘విరాటపాలెం’ వెబ్ సిరీస్‌ తమ ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ‘కానిస్టేబుల్‌ కనకం’ వెబ్ సిరీస్‌కి కాపీ అని ఈటీవీ విన్ సంస్థ ఆరోపించింది. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. 

ఈ వెబ్ సిరీస్‌ దర్శకుడు ప్రశాంత్ కుమార్‌ దిమ్మల మాట్లాడుతూ, “గతంలో నేను ఆ ఓటీటీ సంస్థ పెద్దలని కలిసి ఈ కధ చెప్పాను. అప్పుడు నో చెప్పినవాళ్ళు ఆ తర్వాత గుట్టుగా నా కధతో ‘విరాటపాలెం’ అనే పేరుతో వెబ్ సిరీస్‌ తీసి విడుదల చేశారు. వాళ్ళకి నా కధ స్పూర్తి లేదా ప్రభావం అని ఏమని చెప్పుకున్నా అది కధని దొంగిలించడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాము,” అని హెచ్చరించారు.  

ఈటీవీ విన్ హెచ్చరికపై జీ5 ఓటీటీ సంస్థ, దానిలో ప్రసారమైన‘విరాటపాలెం’ వెబ్ సిరీస్‌ టీమ్‌ కూడా ఘాటుగా స్పందించారు. 

దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ, “మాది నూటికి నూరు శాతం ఒరిజినల్ కధ. మాకు ఎవరి కధలని కాపీ కొట్టాల్సిన కర్మ పట్టలేదు. నిజానికి మా వెబ్ సిరీస్‌ ముందుగా ప్రసారం అయ్యింది కనుక మా ‘విరాటపాలెం’నే ఎవరైనా కాపీ కొడితే కొట్టాలి. ఎలాగూ కోర్టుకి వెళుతున్నారు కదా? అక్కడే ఈ వ్యవహారం తేల్చుకుందాము,” అని ఘాటుగా జవాబిచ్చారు. 

ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ‘కానిస్టేబుల్‌ కనకం’ వెబ్ సిరీస్‌ కనకం ఇంకా ప్రసారం కాలేదు కనుక అది ఎలా ఉందో చెప్పలేము. కానీ జీ5లో ప్రసారమైన ‘విరాటపాలెం’ వెబ్ సిరీస్‌ చూసినప్పుడు బోర్ కొట్టేసి మద్యలోనే మార్చేయాలనిపిస్తుంది. 

అలాంటి వెబ్ సిరీస్‌ తమ ‘కానిస్టేబుల్‌ కనకం’కి కాపీ అని వాదిస్తుంటే, ‘విరాటపాలెం’ కంటే దారుణంగా ఉంటుందా?అని నెటిజన్స్ జోకులు వేస్తున్నారు.

వందల కోట్లు కలెక్షన్స్‌ సాధించి రికార్డ్ సృష్టించిన కల్కి, సలార్ లేదా మరో సినిమాలతో ఇలా పోరాడుకుంటే అర్దం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి వెబ్ సిరీస్‌ కోసం రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు కీచులాడుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.