ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరిట ఒకేసారి 6 సినిమాలను ప్రకటించి సంచలనం సృష్టించింది. రాబోయే 12 ఏళ్ళలో శ్రీమహావిష్ణు దశావతారాలని ఒక్కొక్క సినిమాగా తెరకెక్కించి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ముందుగా అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్ నరసింహ’ ఇప్పటికే మొదలుపెట్టింది. మరణం ఉండదని వరంపొందిన హిరణ్య కశిపుడనే రాక్షసరాజుని శ్రీమహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో వచ్చి సంహరించిన పురాణ కధ అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గ్లింమ్స్‌లో కూడా అదే చూపారు. అయితే ఈ సినిమాలో అదే చూపిస్తారా లేక నరసింహావతారానికి సంబందించి ఎవరికీ తెలియని కొత్త విషయం మరేదైనా చూపిస్తారా? అనేది టీజర్, ట్రైలర్ చూస్తే తప్ప తెలియదు.
ఈ సినిమా నుంచి ‘రోర్ ఆఫ్ నరసింహ’ పేరుతో ఓ పాట విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ తదుపరి సినిమాల పేర్లు, ఏ సంవత్సరంలో విడుదల చేయబోతున్నదీ తెలియజేశారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ ప్రశాంత్ వర్మ, అశ్విన్ కుమార్, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు: ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా. ఈ ఏడాది జూలై 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.