
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తీయబోతున్న సినిమాకి సంబందించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. త్వరలోనే ముంబయిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రెండు సమాంతర ప్రపంచాలు, పునర్జన్మల నేపధ్యంతో తీస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకి అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీ పనిచేయబోతోంది.
కనుక ముంబయిలో షూటింగ్ కోసం ఆ కంపెనీ వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా వస్తున్నారు. ముందుగా వారి ఆధ్వర్యంలోనే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిలో షూటింగ్ జరుగుతుంది.
ఒక్కో సన్నివేశం షూటింగ్ పూర్తయిన వెంటనే వీఎఫ్ఎక్స్ నిపుణులు దానిపై వర్క్ చేస్తుంటారు. ఆ విదంగా ముందు కొన్ని సన్నివేశాలు షూటింగ్ చేసి వీఎఫ్ఎక్స్ చేసి చూసుకొని సంతృప్తికరంగా ఉంటే ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.
దీని కోసం ముంబయిలోని ఓ ప్రముఖ స్టూడియోలో గ్రీన్ మ్యాట్ సెట్స్ వేస్తున్నారు. అక్కడే సుమారు మూడు నెలలు ఈ సినిమా షూటింగ్ జరుగబోతున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి కాగానే అల్లు అర్జున్ ముంబయి బయలుదేరుతారు. అక్కడే మూడు నెలలు ఉంటూ షూటింగ్లో పాల్గొంటారు. వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి పోతుంటారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ‘దీపికా పడుకొనే’ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది అల్లు అర్జున్‌కి 26వ సినిమా, దర్శకుడు అట్లీకి 6వ సినిమా కనుక ఏఏ 26X ఏ6 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాని ప్రారంభిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని సుమారు రూ.700-1000 కోట్లు బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలోనే తీయబోతున్నారు.