ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అవడంపై నిర్మాత దిల్‌రాజు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తన అభిప్రాయం చెప్పారు.
నితిన్‌తో తీసిన తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనప్పుడు గేమ్ చేంజర్ గురించి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఇప్పటి వరకు నేను 60 సినిమాలు తీశాను. వాటిలో గేమ్ చేంజర్ చేయడం నేను చేసిన అతిపెద్ద తప్పు. సాధారణంగా పెద్ద దర్శకులతో పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాత చేతిలో ఏమీ ఉండదు. సినిమా అదుపు తప్పుతోందని తెలిసి పంచాయితీ పెడితే నిర్మాతే నష్టపోతాడు. పూర్తిగా దర్శకుడిపై భారం వేసి వదిలేసినా ఇలా తీవ్రంగా నష్టపోక తప్పదు.
పెద్ద దర్శకులతో, పెద్ద సినిమాలు చేసే ప్రతీ నిర్మాతకి ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమా నాలుగున్నర గంటల నిడివి ఉందని ఎడిటర్ చెప్పిన మాట నిజేమే. సినిమా అదుపు తప్పిందని గ్రహించడానికి ఈ నిడివి ఓ చక్కటి నిదర్శనం.
పెద్ద దర్శకుడితో సినిమా మొదలుపెడుతున్నప్పుడే ఇటువంటివన్నీ అగ్రిమెంట్‌లో వ్రాసుకొని ఉండాలి. కానీ వ్రాసుకోలేదు. కనుక ఈ తప్పులో నాకూ బాధ్యత ఉంది.
జరిగిందానిని ఎవరూ మార్చలేరు. కనుక అక్కడితో ఆ విషయం వదిలేసి ముందుకు సాగిపోతున్నాను. కానీ గేమ్ చేంజర్ విషయంలో చేసిన ఆ తప్పు నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నాను. మళ్ళీ ఎన్నడూ అటువంటి తప్పు చేయను,” అని దిల్‌రాజు అన్నారు.