
శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తీసిన హిట్-3 సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇదిప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. చెన్నైకి చెందిన విమల్ అనే ఓ రచయిత మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ పిటిషన్ వేశారు.
తాను వ్రాసిన ఓ కధని 2021, ఆగస్టులో దక్షిణ భారత సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేసుకొని, ఆ కధని క్లుప్తంగా చేసి 2022, ఆగస్టులో నటుడు నానికి పంపానని, కానీ నాని నుంచి జవాబు రాకపోవడంతో దానిని ఆయన తిరస్కరించినట్లుగా భావించి ఊరుకున్నానని పిటిషన్లో పేర్కొన్నారు.
కానీ హిట్-3 సినిమా చూసిన తర్వాత తన కధ ఆధారంగానే కాస్త మార్పులు చేర్పులతో ఆ సినిమా తీసినట్లు గుర్తించానని పేర్కొన్నారు.
కనుక తనని సంప్రదించకుండా, అనుమతి తీసుకోకుండా తనకు ఎటువంటి పారితోషికం చెల్లించకుండా తన కధని వాడుకొని హిట్-3 సినిమా తీసి భారీగా సంపాదించుకున్నారని విమల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కనుక ఆ సినిమా హక్కుల విక్రయం నిలిపివేసి, సినిమాకు వచ్చిన లాభంలో 20 శాతం తనకు చెల్లించాలని పిటిషనర్ విమల్ కోరారు.
ఆయన పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు ఈ కేసు హిట్-3 దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసి జూలై 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.