అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా: సల్మాన్ ఖాన్

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ జీవితం పూలనావలా సాగిపోతుంటుందని అందరూ అనుకుంటారు. అంతులేని సంపద, పేరు ప్రతిష్టలు, వరుసపెట్టి సినిమా అవకాశాలు.. ఒకటేమిటి అన్నీ ఉన్నాయి కదా? అనుకుంటారు. కానీ తన ఆరోగ్య సమస్యల గురించి ఇంతవరకు ఎవరికీ చెప్పని అనేక విషయాలు ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 

“ముఖ భాగంలో తీవ్రమైన నొప్పి (ట్రైజెమినల్ న్యూరల్జియా) అనే వ్యాధితో బాధ అనుభవిస్తున్నాను. ఇది కాక మెదడు, నరాలకు సంబందించి మరో రెండు రకాల వ్యాధులతో బాధపడుతున్నాను. ఇక షూటింగ్ సమయంలో తరచూ గాయాలవుతూనే ఉంటాయి.

పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నటించిన సినిమాలు హిట్ అవుతాయా లేదా? అనే ఒత్తిడి కూడా ఉంటుంది. ఇన్ని వ్యాధులు, బాధలు, ఒత్తిళ్ళని భరిస్తూనే ప్రేక్షకులని అలరించేందుకు ప్రయత్నిస్తుంటాను. 

ఈ వ్యాధులు చిన్నప్పుడే వచ్చి ఉండి ఉంటే ఈపాటికి వాటిని జయించి ఉండేవాడిని కానీ కెరీర్‌లో మద్యలో వచ్చినందున వాటితో సహవాసం చేయడం నేర్చుకొని నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నాను.

ఎంత అనారోగ్యం, ఎన్ని నొప్పులు, బాధలు ఉన్నా అన్నిటినీ భరిస్తూ సినిమాలలో నటించాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే, నాకు సినిమాలు, అభిమానులే ఉపశమనం కలిగిస్తారు కనుక,” అని సల్మాన్ ఖాన్ అన్నారు.