
తెలుగు సినీ పరిశ్రమలో 80 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నటీమణులకు అవకాశాలు ఉంటే, తెలుగమ్మాయిలకు కేవలం 20 శాతం మాత్రమే ఉంటాయని ప్రముఖ నటి అనన్య నాగళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పదేళ్ళు ఎంతగానో శ్రమిస్తేగానీ ఆ 20 శాతంలో అవకాశం లభించదన్నారు.
ఇతర రాష్ట్రాలు, భాషలకు చెందిన అమ్మాయిలకు సులువుగా టాలీవుడ్‌లో అవకాశాలు లభిస్తుండటాన్ని తాను తప్పు పట్టడం లేదని, కానీ తెలుగు అమ్మాయిల పట్ల దర్శక నిర్మాతలు ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారనేది తన ప్రశ్న అని అనన్య నాగళ్ళ అన్నారు.
అయితే టాలెంట్ నిరూపించుకొని ఆ 20 శాతంలో అవకాశాలు దక్కించుకోవడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. సినిమాలలో నటించాలనే పిచ్చితో హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం చేసే ప్రయత్నాలతో తెలుగు అమ్మాయిలు చాలా రాటు తేలారని, ఇండస్ట్రీ ఎటువంటి సమస్య ఎదురైన ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నారని అన్నారు.
తనకు ‘పొట్టేల్’ సినిమాలో గద్దర్ అవార్డు వస్తుందని అనుకోలేదని కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అనన్య నాగళ్ళ అన్నారు. నిర్మాత నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది.
ఇండస్ట్రీలో పలువురు, మీడియా మిత్రులు అందరి సహకారంతో ఇప్పుడు ఈ సందర్భంగా స్థాయికి చేరుకొని గద్దర్ అవార్డ్ అందుకున్నానని, ఇందుకు పేరు పేరునా ప్రతీ ఒక్కరికీ అనన్య నాగళ్ళ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.