చిరు, వెంకటేష్‌, అనిల్ రావిపూడి.. కుమ్మేస్తారంతే!

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్‌-అనిల్ రావిపూడి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇద్దరికీ కామెడీసెన్స్ అద్భుతంగా ఉండటంతో అదరగొట్టేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్, భోలా శంకర్ వంటి సినిమాలతో చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఇప్పుడు వారు ముగ్గురూ కలిసి సినిమా చేస్తే? ఆ కామెడీ మామూలుగా ఉండదు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా మొదలుపెట్టిన సినిమా షూటింగ్‌ ఇప్పటికే మసూరీలో మొదటి షెడ్యూల్‌ పూర్తిచేశారు. త్వరలోనే రెండో షెడ్యూల్‌ మొదలవబోతోంది. దీనిలో వెంకటేష్‌ కూడా పాల్గొనబోతున్నారు. వెంకటేష్‌ అతిధిపాత్ర చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర కోసం ఆయన నెలరోజులు సమయం కేటాయించి నటించబోతున్నారు. చిరంజీవి, వెంకటేష్‌ కలిసి నటించే సన్నివేశాలు ఈ షెడ్యూల్లో షూటింగ్‌ చేయబోతున్నారు.  కనుక ముగ్గురూ కలిసి ఎలాంటి ధమాకా సృష్టిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎదురుచూడాల్సిందే. 

ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా క్యాథరిన్‌, హర్షవర్ధన్, అభినవ్ గోమటంల, సచిన్ కేడ్కర్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.     

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.