నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న సుహాస్ సినిమా

ఐవీ శశి దర్శకత్వంలో సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా ట్రైలర్‌ బుధవారం విడుదల చేశారు. సుహాస్, కీర్తి సురేష్ స్థాయి నటీనటులు చేసిన ఈ సినిమాని థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదల చేస్తుండటం విశేషం. జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం అవుతుంది. 

ఐవీ శశి ఈ సినిమా కధ చాలా భిన్నమైన పాయింట్ తీసుకొని చక్కటి కామెడీగా మలిచి ఈ సినిమా తీశారని ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది.

మళ్ళీ చాలా కాలం తర్వాత బాబూ మోహన్ తెరపై కనిపించడం, ఏమీ తెలియని ఓ గ్రామ సర్పంచ్‌గా కీర్తి సురేష్ నటన, ఊర్లో శ్మశానంలో మిగిలిన నాలుగు స్థలాలకు గ్రామపెద్దలు పోటీ పడటం, వాటి కోసం లక్కీ డిప్ తీయడం, శ్మశానానికి హౌస్ ఫుల్ బోర్డు పెట్టడం వంటి ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తున్నప్పుడు నవ్వాపుకోలేము.

ఇంత చక్కటి కామెడీ సినిమా ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా జూలై 4న నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుండటం ప్రేక్షకుల అదృష్టమే కానీ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో వాణిజ్య ప్రకటనలు ఓపికగా భరిస్తూ ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.     

ఈ సినిమాలో బాబూ మోహన్, శుభలేఖ సుధాకర్, తాళ్ళూరి రామేశ్వరి, రవితేజ, దువ్వాసి హన్, శివనారాయణ, ప్రభావతీ వర్మ, శతృ ముఖ్యపాత్రలు చేశారు.  

ఎల్లనార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ సినిమాకు కధ: వసంత మరింగంటి, సంగీతం: స్వీకార అగస్తీ, కెమెరా: దివాకర్ మణి, ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్ చేశారు.