
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ అవార్డుల ప్రధానం చేసింది, సిఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ అవార్డులు అందించారు.
అయితే ఈ అవార్డులకు ఎంపికైన ప్రభాస్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని తదితరులు హాజరు కాలేదు.
వారు తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వలన రాలేకపోతున్నామని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కానీ 14 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులను తొలిసారిగా ప్రధానం చేస్తే ఈ కార్యక్రమానికి పలువురు అవార్డు గ్రహీతలు రాకపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
బహుశః అందువల్లే ప్రముఖ సినీ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు సున్నితంగా వారిని మందలించారనుకోవచ్చు. దిల్‌రాజు ఏమన్నారంటే, “సినీ పరిశ్రమ మరింత అభివృద్ధికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రభుత్వం సినీ పరిశ్రమని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తున్నప్పుడు వాటిని తీసుకునేందుకు తప్పకుండా రావాలి. సినిమా షూటింగులు, పనులతో ఎవరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు తీసుకునేందుకు తప్పనిసరిగా రావాలి. అది మనందరి భాద్యత కూడా. మనం ప్రభుత్వంటో కలిసి ట్రావెల్ చేస్తున్నామనే సంగతి మరిచిపోకూడదు,” అని అన్నారు.