పాన్ ఇండియా నాకు సరిపోదు: శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధానపాత్రలు చేసిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగామీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, తన ఆలోచనలు, సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. 

“ఒకప్పుడు స్నేహితుల దగ్గర డబ్బులు అప్పు తీసుకొని సినిమాలు తీసేవాణ్ణి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కుబేర తీయగలుగుతున్నందుకు సంతోషం కలుగుతుంది. అయితే పాన్ ఇండియా సినిమాలు చేయాలనే కోరిక నాకేమీ లేదు. 

ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో తీయాలనుకోలేదు. కానీ ఈ సినిమా కధ.. ముంబయి నేపధ్యంలో సినిమా చిత్రీకరించడం వలన పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. నిజానికి నేను సాధారణ సినిమాలు చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను. పాన్ ఇండియా నాకు సరిపోదు. దాని కోసం చాలా శ్రమించాలి. తీయడం చాలా కష్టం కూడా. కనుక చిన్న సినిమాలకే నేను మొగ్గుచూపుతాను,” అని చెప్పారు. 

కుబేర గురించి చెపుతూ, “ఇది ఓ బిలియనీర్ వర్సస్ బెగ్గర్‌ కధ. సమాజంలో అట్టడుగు వర్గాల పరిస్థితి ఏవిదంగా ఉందని తెలుసుకుంటున్న కొద్దీ ఈ కధ పెరుగుతూనే ఉంది. సమాజంలో జరుగుతున్నవాటినే చూపించానుతప్ప నా మార్క్ లేదా ఏదో సందేశం ఇవ్వాలని ఈ సినిమా తీయలేదు. కానీ కుబేర చూసినప్పుడు అందరూ తప్పక ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది కధ, పాత్రలు, కధనం అన్నీ. 

కధలో ఈ రెండు భిన్నవర్గాలను టచ్ చేసినప్పుడు సహజంగానే రాజకీయాలు కూడా వచ్చి కలుస్తాయి. కానీ వాటిని అలాగే చూపించాను తప్ప అదనంగా ఏమీ జోడించలేదు,” అని చెప్పారు. 

నాగార్జున, ధనుష్ పాత్రల గురించి చెపుతూ, “ఈ కధ వ్రాయడం మొదలుపెట్టినప్పుడే బిలియనీర్ పాత్రకి నాగార్జునని బిచ్చగాడి పాత్రకు ధనుష్‌ని అనుకున్నాను. నాగార్జునని ఒప్పించడం కష్టం కాదు కానీ ధనుష్‌ని ఎలా ఒప్పించగలనని చాలా టెన్షన్ పడ్డాను. 

ఎందుకంటే అదో బిచ్చగాడి పాత్ర.. పైగా ధనుష్‌ దర్శకుడు కూడా. ఆయన ఈ కధని, దీనిలో తన పాత్రని ఏవిదంగా స్వీకరిస్తారోనని టెన్షన్ పడ్డాను. కానీ ఆయనకు కధ, పాత్ర గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పేశారు. ఈ సినిమాలో ఆయనని నటన చూసినప్పుడు ఈ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరని ఖచ్చితంగా చెప్పగలను,” అని శేఖర్ కమ్ముల అన్నారు.