కొత్త రిలీజ్‌ డేట్‌తో వస్తున్న వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 12న విడుదల కావలసి ఉండగా వీఎఫ్ఎక్స్‌ పనులు పూర్తికాకపోవడంతో సినిమా వాయిదా పడింది. సినిమా షూటింగ్‌ మొదలుపెట్టి నాలుగేళ్ళు అయినా పూర్తికాలేదని ఇంతకాలం అభిమానులు బాధ పడితే, ఇప్పుడు రిలీజ్‌ డేట్ ప్రకటించిన చివరి నిమిషంలో వాయిదా వేస్తుండటం తీవ్ర అసహనంగా ఉన్నారు.

గురువారం కొత్త రిలీజ్‌ డేట్ ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. తాజా సమాచారం ప్రకారం జూలై 24 లేదా 25 తేదీలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

కానీ జూలై 4న విడుదల కావలసిన విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ కూడా జూలై 24కి వాయిదా పడటం నిజమే అయితే హరిహర వీరమల్లుని ముందుకు తీసుకు వచ్చి జూలై 4న విడుదల చేస్తారేమో? రేపు రిలీజ్‌ డేట్ ప్రకటిస్తామని చెప్పారు కనుక అంతవరకు ఓపిక పట్టాల్సిందే. 

 హరిహర వీరమల్లులో బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, దక్షిణాది నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లుని మొదలుపెట్టగా జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించారు.