4.jpeg)
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఇదివరకు విడుదల చేయాలనుకున్నప్పుడు మంచు మనోజ్ భైరవం సినిమాని పోటీగా దించడంతో వాయిదా వేసుకోక తప్పలేదు.
ఇప్పుడు విడుదల చేయబోతుంటే కన్నప్ప సినిమాలో కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు బ్రాహ్మణులని కించపరిచేలా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ పడింది.
బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆ డైలాగ్స్, సన్నివేశాలు తొలగించాలని లేకుంటే సినిమా విడుదల చేయనీయకుండా నిలిపివేయాలని వాదించారు.
ఆ పిటిషన్‌లో కేంద్ర రాష్ట్ర స్థాయి సెన్సార్ బోర్డులు, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, ఈ సినిమాలో నటించిన మోహన్ బాబు, బ్రహ్మానందం, సప్తగిరిని ప్రతివాదులుగా పేర్కొనడంతో, హైకోర్టు వారికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణని ఆగస్ట్ 1 కి వాయిదా వేసింది.
సినిమా విడుదలపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, సినిమా విడుదలైన తర్వాత దానిలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లయితే న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తే వాటిని తొలగించమని దర్శక నిర్మాతలను ఆదేశిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి చెప్పారు.