నిఖిల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

నిఖిల్ సిద్దార్ధ్ నటిస్తున్న ‘ది ఇండియన్ హౌస్’ సినిమా షూటింగ్లో బుధవారం ఓ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో సముద్రం సెట్ వేసేందుకు ఓ భారీ నీళ్ళ ట్యాంక్ తెప్పించి ఏర్పాట్లు చేస్తుండగా, హటాత్తుగా అది పగిలిపోయింది.

దాంతో నిజంగానే సముద్రం పొంగి ప్రవహించి ముంచెత్తినట్లు సెట్, దానిలో పనిచేసిన సిబ్బంది, పరికరాలు అన్నీ అ నీళ్ళలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మ్యాన్ గాయపడ్డాడు. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఎంతో శ్రమించి సిద్దం చేసిన ‘సముద్రం సెట్’, పరికరాలు అన్నీ నీట మునగడంతో చాలా నష్టం జరిగింది. 

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు వీర సావర్కర్ జీవిత గాధ ఆధారంగా రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో ‘ది ఇండియన్ హౌస్’ సినిమా పాన్‌ ఇండియా మూవీగా తీస్తున్నారు. ‘వి మెగా పిక్చర్స్’ రామ్ చరణ్‌ సొంత బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్, తెలంగాణ జాగృతి నారాయణ అగర్వాల్‌ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, కైల్ పాల్, మార్క్ బెన్నింగ్ టన్, కార్ల్ వారన్, జియోఫ్రే గులియానో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: జెర్రీ సిల్వర్‌స్టర్ విన్సెంట్, కెమెరా: కెమెరాన్ బ్రైసన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, ఆర్ట్: విశాల్ అబాని చేస్తున్నారు. 

గత ఏడాది జూలై 1 వ తేదీన హంపిలో విరూపాక్ష స్వామి ఆలయంలో ఈ సినీపా పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు.