సెట్స్‌లో అడుగుపెట్టిన ఉస్తాద్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ మంగళవారం నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. క్రిష్, జ్యోతి కృష్ణల దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’ ఇటీవలే డబ్బింగ్ వర్క్ సైతం పూర్తి చేశారు. దాని తర్వాత సుజీత్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘ఓజీ’లో తన పాత్ర పూర్తి చేశారు.

నేటి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో అడుగుపెట్టి ఈ సినిమాని కూడా పూర్తి చేయనున్నారు. వీటిలో హరిహర వీరమల్లు ఈ నెల 12న విడుదల కావలసి ఉండగా సీజీ వర్క్స్ ఆలస్యం అవడంతో చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేదు.

కానీ ఓజీ సినిమా సెప్టెంబర్‌ 25వ తేదీన దసరా పండుగకు విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి చేస్తున్నారు కనుక బహుశః డిసెంబర్‌లో విడుదల చేస్తారేమో? 

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్‌ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఇది 2016 లో విడుదలైన తమిళ సినిమా ‘తేరి’కి తెలుగు రీమేక్. ఈ సినిమాకి కధ: అట్లీ, దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ఉస్తాద్ భగత్ సింగ్‌ నిర్మిస్తున్నారు.