గోడ దూకి లొకేషన్ చేరుకున్న అనుపమ్ ఖేర్

బాలీవుడ్‌లో సీనియర్ నటులలో అనుపమ్ ఖేర్ ఒకరు. ఇప్పుడు ఆయన చాలా తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. ప్రభాస్‌-హను రాఘవపూడి కాంబినేషన్‌లో తీస్తున్న ‘ఫౌజీ’లో ఆయన ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

హైదరాబాద్‌ శివారులో ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండటంతో శనివారం ఉదయం అక్కడికి కారులో చేరుకున్నారు. కానీ కారు డ్రైవర్ దారి తప్పడంతో షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి రెండో వైపు చేరుకున్నారు. వెనక్కు తిరిగి వెళ్ళి రావాలంటే చాలా సమయం వృధా అవుతుంది. కానీ లొకేషన్‌కి ఆయన కారున్న ప్రదేశానికి మద్యలో ఓ గోడ అడ్డంగా ఉంది.

అప్పుడు లొకేషన్‌లో ఉన్న సిబ్బంది ఓ నిచ్చెన తెచ్చి వెయ్యగా అనుపమ్ ఖేర్ దానిపై ఎక్కి గోడపైకి చేరుకుని అవతాలివైపు దిగారు. ఈ ఫోటో, వీడియోని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈరోజు షూటింగ్‌లో పాల్గొనేందుకు చిన్న సాహసం చేయాల్సి వచ్చిందని జోక్ చేశారు. అనుపమ్ ఖేర్ వయసు ప్రస్తుతం 70 ఏళ్ళు.

ఈ వయసులో కూడా ఆయన ఇంత హుషారుగా చురుకుగా షూటింగ్‌లో పాల్గొంటూ వరుసపెట్టి సినిమాలు చేస్తుండటం విశేషమే కదా?