
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ సినిమాలు వేరేగా ఉంటాయని అందరికీ తెలుసు. విలక్షణమైన కధలు, పాత్రలతో సినిమాలు తెరకెక్కించి అందరినీ మెప్పిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ‘సితారే జమీన్ పర్’ అనే సినిమా పూర్తిచేశారు. జూన్ 20న విడుదలవుతున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచ్‌గా నటించారు. మానసిక ఒత్తిళ్లు భరిస్తూ బాస్కెట్ బాల్ ఆటగాళ్ళని తీర్చిదిద్దడం ఈ సినిమా బేసిక్ కధ.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. సూపర్ హీరో జోనర్‌లో యాక్షన్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తామని చెప్పారు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేమని, వచ్చే ఏడాది జూన్ నెలలో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇది చాలా భారీ బడ్జెట్‌తో తీస్తున్న యాక్షన్ మూవీ కనుక ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తవడానికి ఆ మాత్రం సమయం అవసరమని అమీర్ ఖాన్ చెప్పారు. కనుక 2027-28 మద్య ఎప్పుడో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంటుందని అమీర్ ఖాన్ చెప్పారు.
ఆలోగా రాజ్ కుమార్ హీరాణీతో కలిసి దాదా సాహెబ్ ఫాల్కే జీవితగాధ ఆధారంగా ఓ సినిమా పూర్తిచేయాలనుకుంటున్నాని చెప్పారు.
ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మొదలుపెడతానని, అంత గొప్ప కధని ఒక్క భాగంలో తీయడం చాలా కష్టం కనుక కొన్ని భాగాలుగా తీయాలనుకుంటున్నానని చెప్పారు. అందువల్ల బహుశః అదే తన చివరి సినిమా కావచ్చని అమీర్ ఖాన్ అన్నారు.