
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 2020లో మొదలుపెట్టారు. అంటే దాదాపు 5 ఏళ్ళ క్రితం అన్నమాట. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఓ భారీ బడ్జెట్ సినిమా విడుదలకాకపోతే ఆ నిర్మాత ఎంతగా నష్టపోతాడో పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు.
ఈసారి జూన్ 12న విడుదల కాబోతోంది వ్రాసి పెట్టుకోమని చెప్పినప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడం వలన సినిమా వాయిదా పడబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 8 న తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నం నుంచి తీసుకున్న రూ.11 కోట్లు అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు తన వలననే ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు జూన్ 12న విడుదలవుతుంటే అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? కానీ ఇస్తున్నారంటే సినిమా వాయిదా పడిందనే భావించవచ్చు.
జూలై మొదటి వారంలో హరిహర వీరమల్లు విడుదల చేసేందుకు నిర్ణయించనట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.