జనవరికి వస్తానన్న విశ్వంభర దసరాకైనా వస్తుందో లేదో?

మల్లాది వశిష్ట వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేసిన ‘విశ్వంభర’ 2025, జనవరిలో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ రామ్ చరణ్‌ ‘గేమ్ చేంజ్‌’ చేస్తానంటూ రావడంతో కొడుకు కోసం విశ్వంభరని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. అంటే అప్పటికే సినిమా విడుదలకి సిద్దంగా ఉందని అందరూ భావించారు.

కానీ వేసవి సీజన్ పూర్తవుతున్నా ఇంతవరకు విశ్వంభర రిలీజ్‌ ఊసే వినిపించడం లేదు. ఎందువల్ల అంటే కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం అవుతోందని టాక్. నేటికీ సీజీ వర్క్స్ పూర్తికానప్పుడు మరి ఏ లెక్కన సంక్రాంతికి రిలీజ్‌ చేద్దామనుకున్నారో తెలీదు.

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది అయిపోయాయి. ఇప్పుడు ఆగస్ట్ 15,  వినాయక చవితి, దసరా, దీపావళికైనా విశ్వంభర వస్తే చాలని మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పండుగ సీజన్‌కి అనేక సినిమాలు రిలీజ్‌ ముహూర్తాలు ప్రకటించేశాయి. మరి విశ్వంభర ముహూర్తం ఎప్పుడో? చిరంజీవే చెప్పాలి.        

చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి సోషియో ఫాంటసీ జోనర్‌లో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా:  ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందించారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి విశ్వంభర సిద్దం చేస్తున్నారు.