
కమల్ హాసన్ ప్రధాన పాత్ర చేసిన ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కాబోతోంది. అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, “తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది” అని అన్నారు.
దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సహా ఆ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల నేతలందరూ అభ్యంతరం చెపుతున్నారు. కన్నడ సంఘాలు ‘థగ్ లైఫ్’ సినిమా ప్రదర్శిస్తే అడ్డుకుంటామని థియేటర్స్ యాజమానులను హెచ్చరించాయి.
కమల్ హాసన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్నారు. కానీ కమల్ హాసన్ తాను కన్నడ భాష పట్ల ప్రేమతో అన్న మాటని వక్రీకరించి క్షమాపణ కోరితే చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో కర్ణాటకలో సినిమా విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.
కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెపుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు వివరణ ఇస్తూ కమల్ హాసన్ వ్రాసిన లేఖను ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకి సమర్పించారు.
కానీ ఒక క్షమాపణ చెప్పి సమస్యని ముగించుకోకుండా ఇలా కోర్టు వరకు రావడం దేనికి అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ న్యాయవాది అభ్యర్ధన మేరకు ఈ కేసు తదుపరి విచారణని జూన్ 10కి వాయిదా వేసింది.
ఆలోగా కమల్ హాసన్ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో రాజీ కుదుర్చుకుంటే సరేసరి లేకుంటే తీర్పు చెపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎట్టి పరిస్థితులలో క్షమాపణలు చెప్పానని కమల్ హాసన్ తేల్చి చెప్పేశారు. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల చేయకూడదని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు.