
ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్న దర్శకుడు మారుతి ఎట్టకేలకు ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ ఖరారు చేశారు. కానీ అదీ ఇప్పుడప్పుడే రావడం లేదు. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.
కనుక అప్పటికైనా తమ రాజా సాబ్ మారుతి చెర నుంచి బయటపడి తమ ముందుకు వస్తున్నాడాని సంతోషించాలో, మరో ఏడు నెలలు రాజాసాబ్ కోసం ఎదురుచూడాల్సి వస్తున్నందుకు బాధపడాలో తెలీని పరిస్థితి.
కల్కి, సలార్ వంటి భారీ సినిమాలే చకచకా తీస్తున్నప్పుడు రొటీన్ హర్రర్ కామెడీ సినిమా ‘రాజాసాబ్’ పూర్తిచేసేందుకు మారుతి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ రాజాసాబ్ డిసెంబర్ 5న రావడం ఖాయం అయ్యింది కనుక సంతోషమే.
మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే, రాజాసాబ్ టీజర్ ఈ నెల 16న ఉదయం 10.52 గంటలకు విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది.
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నమ్మినవారి చేతిలో మోసపోయి హత్య చేయబడిన ‘రాజాసాబ్’గా ఓ పాత్ర, ఆయన మనుమడిగా మరో పాత్ర చేస్తున్నారు.
పెద్ద రాజాసాబ్ ఆత్మ పాడుబడిన తన ప్యాలస్‌లో ఉండిపోతుంది. దానిలోకి మనుమడు ప్రవేశించడంతో అసలు కధ మొదలవుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.