
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిష జంటగా చేసిన ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘కన్నడ భాష కూడా తమిళ భాష నుంచే పుట్టింది,’ అని అనడంపై కర్ణాటకలో పెద్ద దుమారం మొదలైంది.
కర్ణాటక సిఎం సిద్ద రామయ్యతో సహా పలువురు కమల్ హాసన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. కమల్ హాసన్‌కు కన్నడ భాష పుట్టు పూర్వోత్తరాలు తెలియకుండా మాట్లాడారని సిఎం సిద్ద రామయ్య అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై కమల్ హాసన్ వెంటనే స్పందిస్తూ, “నేను కన్నడ భాషపై ప్రేమతోనే ఆ విదంగా అన్నాను తప్ప నాకు వేరె ఉద్దేశ్యం లేదు. ప్రేమ ఎన్నడూ క్షమాపణ కోరదు. నేను అనేక భాషలలో నటిస్తుంటాను. కనుక ఆయా భాషల గురించి, వాటి చరిత్రల గురించి మేధావుల ద్వారా తెలుసుకుంటాను.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని తమిళనాడు ప్రజలు అందరినీ తమలో కలుపుకుంటారని చెప్పేందుకే నేను ఆ మాట అన్నాను. అయినా భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదు. అలాగే నాకు కూడా లేదు. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు సాగుదాం,” అని అన్నారు.